మనమే మీడియా (చీపురుపల్లి):
గ్రామాల్లో యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చీపురుపల్లి ఎస్ఐ దామోదరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని మెట్టపల్లి గ్రామంలో పోలీసు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై, పలు సామాజిక అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.ఈ పర్యటనలో ఎస్ఐ ప్రధానంగా గంజాయి వినియోగం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలను హెచ్చరించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యువత తమ బంగారు భవిష్యత్తును వ్యసనాలకు బలి చేయవద్దని కోరారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తెలియని వ్యక్తులకు ఓటిపి (OTP)లు చెప్పవద్దని.
అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని అవగాహన కల్పించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణ అని వివరించారు.పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని, వారు ఎవరితో తిరుగుతున్నారో గమనించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్ఐ, వాటి పరిష్కారానికి పోలీసు శాఖ తరపున పూర్తి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మెట్టపల్లి గ్రామ సర్పంచ్ బూట్ శ్రీనివాసరావు, టెంపుల్ కమిటీ చైర్మన్ వెంపటాపు రమణమూర్తి, గ్రామ పెద్దలు, యువకులు మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

