విగ్రహాలతో రాజకీయాలు _ ప్రజాస్వామ్యానికి పంగనామాలు

శృంగవరపుకోట(మనమే మీడియా),జనవరి 12:
విగ్రహాలతో రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పంగనామాలు
ఇప్పటికే దేశంలో నాటి సర్దార్ వల్లభాయి పటేల్ మొదలు బాబాసాహెబ్ అంబేద్కర్, నేటి నందమూరి తారక రామారావు విగ్రహం వరకూ నిర్మాణ వ్యయానికి అయ్యే వేల కోట్ల ప్రజాధనం వ్యయాలపై చల్లారని చర్చలు జరుగుతూ ఉంటే శృంగవరపుకోటలో అరకు-విశాఖ రహదారికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి స్థాపితం కాబడిన విశ్వకర్మ విగ్రహం స్థానికులను పలుసందేహాలకు గురిచేస్తుంది. ఇటువంటి చర్యలు వెనుక నాయకుల అండదండలు విగ్రహాలతో రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పంగనామాలుగా తోస్తుంది. ఆదివారం కార్యాలయాలకు సెలవు కావడంతో అధికారులు తేరుకునేలోగా సడీసప్పుడు లేకుండా తాము అనుకున్న ముందస్తు ప్రణాళికను అమలుచేద్దామనుకున్నారో ఏమో శనివారం ఏ అర్ధరాత్రినో ప్రారంభించి ఆదివారం ఉదయానికల్లా విశ్వకర్మ విగ్రహాన్ని పీఠంతో సహితం స్థాపితం చేసేసారు. మాకు ఏ శాఖల అనుమతీ అక్కర్లేదు, స్ధానిక సంస్థల, పోలీసుల, రెవెన్యూ, రహదారి భవనాల శాఖల అనుమతులు మాకేల మాకు మా నాయకుల అండదండలుంటే చాలనుకన్నట్లు కనిపిస్తుంది ఈ వ్యవహారమంతా. విగ్రహం ప్రతిష్టకు సంబంధించి పంచాయితీలో ఎటువంటి తీర్మాణమూ జరగలేదు. మండల స్థాయీ అధికారులను స్వయంగా కలిసి, వాట్సాప్ ద్వారా జిల్లా స్థాయీ మరియు భారత జాతీయ రహదారుల అధికార సంస్థకు ఫిర్యాదు చేసినట్లుగా స్థానిక పంచాయితీ 13 వ వార్డు సభ్యుడు డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు తెలియజేసారు. ఫిర్యాదుకు స్పందించిన తహశీల్దార్ శ్రీనివాసరావు, యమ్.పి.డి.వో. సతీష్, యన్.హెచ్.ఐ.ఏ.సహాయక ఇంజనీర్ సురేష్ చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ స్పందిస్తూ భారతదేశంలో విగ్రహ ప్రతిష్ట అనేది హిందూ చట్టం, రాజ్యాంగ హక్కులు, ప్రజాక్రమ నిబంధనలతో కూడిన దన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26 మత స్వేచ్ఛను కల్పించినప్పటికీ అది దుర్వినియోగం కాకూడదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడానికి పోలీసుల, స్థానిక సంస్థల అనుమతి అవసరం. ఇది ప్రజాసంక్షేమం, శాంతిభద్రతలతో కూడినది. ప్రభుత్వ స్థలాల్లో శాశ్వత నిర్మాణాలు, విగ్రహాలను ఏర్పాటు చేసే అధికారం కేవలం ప్రభుత్వం, స్థానిక సంస్థలకు మాత్రమే ఉంటుందని న్యాయస్థానాలూ నొక్కి చెబుతున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు వివాదాలకు తెరలేపుతున్నాయి. న్యాయస్థానాల తీర్పులను విస్మరిస్తూ, స్థానిక సంస్థలను అగౌరవపరచడమేనన్నారు. అధికారులు చట్టరీత్యా స్పందించి తొలగింపు చర్యలు చేపట్టక ముందే శాశ్వత నిర్మాణం చేపట్టి విగ్రహాన్ని ప్రతిష్టించినవారు తమకు తాముగా విగ్రహాన్ని తమ ప్రైవేటు లేదా వ్యక్తిగత స్థలాల్లోనికి తరలించి చట్టాలను గౌరవించడం ద్వారా తమ‌గౌరవాన్ని, తమ నాయకుల గౌరవాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి బలవంతుడిదే రాజ్యం అనే నియంతృత్వపోకడలకు స్వస్థిపలికింపజేయవలసిన బాధ్యత ప్రజా ప్రతినిధులపైన, ప్రభుత్వ అధికారులు పైనా ఉంటుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *