గరివిడి (మనమే మీడియా):పండుగ వేళ మండల ప్రజలు సుఖసంతోషాలతో గడపాలని, అదే సమయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని గరివిడి సబ్ ఇన్‌స్పెక్టర్ లోకేశ్వర్ రావు స్పష్టం చేశారు. పండుగ సెలవుల దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయన మండల ప్రజలకు పలు కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు.
కోడి పందాలు, జూదం (పేకాట), ఇతర గ్యాంబ్లింగ్ క్రీడలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై హెచ్చరించారు.
జంతు హింస నిరోధక చట్టం – 1960: కోడి పందాలు నిర్వహించినా, ప్రోత్సహించినా ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం – 1974: జూదక్రీడలు ఆడేవారిపై, నిర్వాహకులపై ఈ చట్టం కింద కఠిన చర్యలు తప్పవు.
సొంత ఊర్లకు వెళ్లే వారు తమ ఆస్తుల రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేయాలి. వీలైతే పొరుగువారికి సమాచారం అందించాలి.
విలువైన నగలు, నగదు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్త పడాలి.
అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
పండుగ రద్దీ దృష్ట్యా వాహనదారులు సంయమనం పాటించాలని కోరారు.
మద్యం సేవించి వాహనాలు నడపరాదు,
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి.
అతి వేగం ప్రమాదకరం, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలను సీజ్ చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని తెలిపారు.
“ప్రజలందరూ చట్టానికి సహకరించి, పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా జరుపుకోవాలి. అసాంఘిక శక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించి మండలంలో శాంతి భద్రతలను కాపాడాలి” అని ఎస్సై లోకేశ్వర్ రావు కోరారు.

