నేరాల రహిత సమాజమే లక్ష్యం: కోడూరులో ఎస్ ఐ లోకేశ్వరరావు అవగాహన సదస్సు,

మనమే మీడియా(గరివిడి):
ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నప్పుడే నేర రహిత సమాజం సాధ్యమవుతుందని గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం గరివిడి మండలం, కోడూరు గ్రామంలో శాంతిభద్రతలు, సైబర్ భద్రత మరియు సామాజిక రుగ్మతలపై గ్రామస్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ. లోకేశ్వరరావు మాట్లాడుతూ…ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని, వీలైనంత వరకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేయాలన్నారు.అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, బ్యాంక్ వివరాలు మరియు ఓటిపి (OTP)లను ఎవరికీ చెప్పకూడదని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని అవగాహన కల్పించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి వంటి వ్యసనాల వల్ల జీవితాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా ఎస్ ఐ భరోసా ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *