మెరకముడిదాం,జులై 14 మనమే మీడియా:
మెరకముడిదాం మండలంలోని గర్భం రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో ఈరోజు “పొలం పిలుస్తోంది” కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అనుసరించాల్సిన శాస్త్రీయ సాగు విధానాలపై వ్యవసాయ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు (Fall Armyworm) నివారణకు వేపనూనె (Neem Oil) 5 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల ప్రారంభ దశలో పురుగు ఉధృతి తగ్గుతుందని, మిత్ర కీటకాలు సంరక్షించబడటంతో పాటు రసాయన పురుగుమందుల వినియోగం కూడా తగ్గుతుందని వివరించారు. అలాగే పొలాలను తరచూ పరిశీలించి, గుడ్ల గుంపులు, చిన్న లార్వాలను గుర్తించిన వెంటనే సమగ్ర పురుగు యాజమాన్య (IPM) పద్ధతులను అనుసరించాలని రైతులకు సూచించారు.
అదేవిధంగా, ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితుల్లో వరి నారు మడులను సంరక్షించేందుకు అనుసరించాల్సిన మెళకువలను వివరించారు. నారు మడుల్లో తేమను నిల్వ ఉంచడం, అవసరమైనప్పుడు స్వల్ప నీటిపారుదల అందించడం, కలుపు నివారణ చేపట్టడం, సమతుల్య ఎరువుల వినియోగం, నారు బలంగా పెరిగేలా తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాలు ఆలస్యమైనా నారు దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సూచనలను పాటించి, పంటలను తరచూ పరిశీలిస్తూ సమస్యలు కనిపించిన వెంటనే సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెరకముడిదాం మండల వ్యవసాయ అధికారి (MAO) శ్రీ ఎస్.కె. అహ్మద్ గౌస్, వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA), చీపురుపల్లి శ్రీ ఎన్. కోటేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) శ్రీమతి మాధవీలత, ఎం.పి.ఈ.ఓ. శ్రీ శశిబాబు, నసయ్యపేట గ్రామ రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

